నిద్రపోతున్న నిఘా నేత్రాలు | - | Sakshi
Sakshi News home page

నిద్రపోతున్న నిఘా నేత్రాలు

Apr 13 2026 8:14 AM | Updated on Apr 13 2026 8:14 AM

సీసీ కెమెరాల నిర్వహణ గాలికి..

నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమంటారు. కానీ వాటి నిర్వహణను గాలికి వదిలేశారు. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. సీసీ కెమెరాలను ఎప్పటికప్పడూ చెక్‌ చేస్తూ వాటి నిర్వహణ చూసేవారు లేక గ్రామాలు, పట్టణాల్లో దొంగతనాలు పెరుగుతున్నాయి. మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం తాళం వేసిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. 20 రోజుల క్రితం రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి రాగి తీగలు దొంగిలించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతోనే చోరీలు ఎక్కువయ్యాయి. మండలంలోని కాటేపల్లి, బేగంపూర్‌, కాస్లాబాద్‌, వడ్లం, పోచారం తండా, పెద్దకొడప్‌గల్‌ గ్రామాల్లో గతంలో దాతల సహయంతో 88 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం కొత్త సర్పంచులు వచ్చినా సీసీ కెమెరాల నిర్వహణకు సహకారం అందించకపోవడంతో నేరాలు నియంత్రించడానికి పోలీసులకు ఇబ్బంది మారింది. పోలీస్‌ అధికారులు స్పందించి గ్రామ సర్పంచుల సహాయంతో త్వరగా మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పలు చేట్ల మొరాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. సీసీ కెమెరాల నిర్వహణను గతంలో ప్రజాప్రతినిధులు చూసుకునేవారు. ప్రస్తుతం కొన్ని చోట్ల సీసీ కెమెరాల పనితీరు సరిగ్గాలేదు. గ్రామ సర్పంచుల సహకారంతో మరమ్మతులు చేయించి నేరాల నియంత్రణకు కృషి చేస్తాం.

–అరుణ్‌ కుమార్‌, ఎస్సై, పెద్దకొడప్‌గల్‌

Advertisement
 
Advertisement
Advertisement