బల్దియాకు మొండి బకాయిల భారం | - | Sakshi
Sakshi News home page

బల్దియాకు మొండి బకాయిల భారం

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

ఏళ్లుగా మడిగెల ఆస్తి పన్ను

చెల్లించని నిర్వాహకులు

రూ. 1.18 కోట్లకు చేరిన బకాయిలు

వసూళ్లలో అధికారుల మెతక వైఖరి

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి బల్దియాకు సంబంధించిన మడిగెల ఆస్తి పన్నుల వసూళ్లలో అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.

మున్సిపాలిటీకి సంబంధించి జిల్లాకేంద్రంలో 122 మడిగెలు ఉన్నాయి. సుభాష్‌రోడ్‌, డైలీ మార్కెట్‌, స్టేషన్‌రోడ్‌, మటన్‌ మార్కెట్‌లలో ఉన్న మున్సిపల్‌ మడిగెల ద్వారా ఏటా బల్దియాకు లక్షల్లో ఆదాయం రావాల్సి ఉంది. అయితే చాలాకాలంగా సదరు దుకాణాల నిర్వాహకులు ఆస్తి పన్నులు చెల్లించడం లేదు. ప్రస్తుతం ఈ బకాయిల మొత్తం రూ. 1.18 కోట్లకు చేరింది. వాణిజ్య పరంగా మంచి ఆదాయం గడిస్తున్నప్పటికీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో మాత్రం ఆయా మడిగెల నిర్వాహకులు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది.

అధికారుల ఉదాసీనతే కారణమా..

పన్నులు వసూలు చేయడంలో అధికారులు అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే బకాయిలు పేరుకుపోతున్నాయి. సాధారణ పౌరులు ఇంటి పన్ను చెల్లించకపోతే నోటీసులు ఇవ్వడం, జరిమానాలు విధించడం చేసే అధికారులు.. భారీగా బకాయిలు ఉన్న దుకాణదారుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదనే విమర్శలున్నాయి. కనీసం దుకాణాలకు నోటీసులు ఇచ్చి సీజ్‌ చేసే సాహసం కూడా చేయడం లేదు. ఈ విషయంపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లలితను ‘సాక్షి’ వివరణ కోరగా నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నామన్నారు. దుకాణదారులు స్పందించకుంటే ఇక ఉపేక్షించబోమని, వాటిని సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement