కామారెడ్డి క్రైం: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం అమలుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ప్రమాదాలను తగ్గించడం అరైవ్ అలైవ్ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రణాళిక ప్రకారం రోజువారీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్, డీటీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


