కామారెడ్డి క్రైం: పైప్‌లైన్ ద్వారా సహజవాయువు (పీఎన్‌జీ) విస్తరణ కోసం జిల్లాలో త్వరలోనే సర్వే చేపట్టనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఇందుకోసం బుధవారం కలెక్టరేట్‌లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వాణిజ్య ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ పైప్‌లైన్ పనులు చేపడుతోందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు భూమి గుర్తింపు కోసం సర్వే చేపడుతున్న దశలో ఉందన్నారు. తూర్పు–పడమర పైప్‌లైన్ (కాకినాడ –ముంబయి) నుంచి అనుసంధానంగా జిల్లా నుంచి అదనపు పైప్‌లైన్ వేస్తున్నారన్నారు. ఇదంతా భూసేకరణపై ఆధారపడి ఉంటుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు భూసేకరణ, అనుమతుల మంజూరు, తదితర పనుల విషయంలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.


