మద్నూర్(జుక్కల్): మండలంలోని రూసెగావ్ గేటు వద్ద జాతీయ రహదారి 161పై బుధవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న హన్మంత్ డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. మండలంలోని శేఖాపూర్ గ్రామానికి చెందిన హన్మంత్ లచ్చన్ గేట్ వద్ద పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లచ్చన్‌గేట్ నుంచి బిచ్కుంద వైపు బైక్‌పై వెళ్తుండగా రూసేగావ్ గేట్ వద్ద డివైడర్‌ను ఢీకొని పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బైక్ దొంగలకు ఏడాది జైలు
నిజామాబాద్ లీగల్: బైక్ దొంగతనాలను అలవాటుగా మార్చుకున్న ఇద్దరు దొంగలకు నిజామాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి ఏడాది కఠిన కారాగార శిక్ష, చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీసు రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా నవ తాలుకా, కాప్సి గ్రామానికి చెందిన సుధ్‌మాధవ్ టోమ్కే, రెంజల్ మండలం దూపల్లికి చెందిన పూదారి నగేశ్ బైక్ దొంగతనాలను అలవాటుపడ్డారు. నిజామాబాద్ రెండో టౌన్ పరిధిలో బైక్ దొంగతనానికి పాల్పడగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం కోర్టుకు అప్పగించారు. నిందితులపై రెండో టౌన్‌తోపాటు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో బైక్ చోరీ కేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి నిందితులు బైక్ చోరీలకు అలవాటుపడ్డారని గుర్తించి కఠిన కారాగార శిక్షతోపాటు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
చోరీ కేసులో ఏడాది..
కామారెడ్డి క్రైం:దొంగతనం కేసులో నిందితునికి కా మారెడ్డి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 16న సదాశివనగర్‌కు చెందిన బంజ సిద్దవ్వ ఇంటికి తాళం వేసి మే డ్చల్ వెళ్లగా దొంగలు పడి రూ.10 వేల నగదు, కొంత బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎంపేట రంజిత్ కు మార్‌ను నిందితుడిగా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. సాక్ష్యాలను పరిశీలించిన అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ భట్టు దీక్ష నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించారు.కేసును సరైన పద్ధతిలో విచారించిన ఎస్సైలు రంజిత్, పుష్పరాజ్, ఏపీపీ రజినీ,సిబ్బందిని ఎస్పీ రాజేశ్‌చంద్ర అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
యాత్రికురాలు మృతి
● విజయనగరం జిల్లా వాసిగా గుర్తింపు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్ర సమీపంలోని ఇల్చిపూర్ శివారులో గల జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యాత్రికురాలు మృతి చెందింది. దేవునిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా బోండాపల్లి మండలం కంచిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కడియాల రమణమ్మ (55) తన కుటుంబసభ్యులతో కలిసి ఎస్‌వీఎల్ ట్రావెల్స్ బస్సులో బాసరకు బయల్దేరారు. ప్రయాణికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇల్చిపూర్ శివారులో బస్సును నిలిపారు. అదే సమయంలో రమణమ్మ బస్సు దిగి రోడ్డు పక్కన నిల్చుండగా నిజామాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన రమణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బాన్సువాడ : డ్రంకెన్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గోపాల్ ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని సీఐ శ్రీధర్ తెలిపారు. బాన్సువాడకు చెందిన మోచీ సురేశ్, గౌరారం గ్రామానికి చెందిన గైని సాయిలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. దీంతో ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుందలో అనుమానాస్పదంగా తిరుగున్న వ్యక్తిని పట్టుకొని బుధవారం తహసీల్దార్ వేణుగోపాల్ ఎదుట బైండోవర్ చేశారు. రెండ్రోజులుగా కాలనీలోని ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్రవాహనాల నుంచి రాత్రి సమయంలో పెట్రోల్ దొంగిలిస్తున్నారు. అయితే, కొత్తగా ఓ వ్యక్తి సంచరిస్తుండడంతో అనుమానంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టి భైంసాకు చెందిన సూర్యవంశీగా గుర్తించారు. విచారణ అనంతరం బైండోవర్ చేసి వదిలేశారు.


