ప్రవర్తనను.. ‘స్కాన్‌’ చెయ్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రవర్తనను.. ‘స్కాన్‌’ చెయ్‌..

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

అభిప్రాయం తెలపవచ్చు..

పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితుల

అనుభవాలు, పోలీసుల ప్రవర్తన కోసం..

ప్రజలకు అందుబాటులో

క్యూ ఆర్‌ కోడ్‌లు

ఎల్లారెడ్డి: పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులు తమకు అక్కడ ఎదురైన అనుభవాలు, పోలీసుల ప్రవర్తన విషయమై క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా నేరుగా ఉన్నతాధికారులకు అభిప్రాయాలు తెలుపవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ అమలు అవుతున్న విషయం తెలిసిందే. పోలీస్‌ స్టేషన్‌కు వివిధ ఫిర్యాదులతో వెళ్లిన బాధితులు తమకు స్టేషన్‌లో ఎదురైన అనుభవాలు పోలీసు అధికారుల ప్రవర్తనను మంచైనా, చెడు అయినా నేరుగా ఉన్నతాధికారులకు తెలుపవచ్చు. ఇందు కోసం పోలీస్‌శాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించి పోలీస్‌స్టేషన్లలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆ యాప్‌ క్యూ ఆర్‌ కోడ్‌ను ఉంచుతోంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారితో అధికారులు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై గతంలో అనేక మంది బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగడం లేదని, కొందరు పోలీస్‌ ఆఫీసర్లు ఏక పక్షంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారంటూ నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము ఫిర్యాదు చేసిన సంగతి పోలీస్‌వాళ్లకు తెలిస్తే తమపై కక్ష సాధింపు చర్యలు చేపడతారని పలువురు పోలీస్‌స్టేషన్‌లో చేదు అనుభవాలు ఎదురైన స్థానిక పోలీసుల భయంతో మిన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ పనితీరుపై ప్రజల నుంచి స్థానిక పోలీసులకు తెలియకుండా నేరుగా అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ క్యూ ఆర్‌ కోడ్‌ను రూపొందించింది. ఈ క్యూ ఆర్‌ కోడ్‌ పోస్టర్లను ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మెయిన్‌ గేట్‌, రిసెప్షన్‌ కౌంటర్‌, వెయిటింగ్‌ రూమ్‌, ఎస్సై గది వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యూ ఆర్‌ కోడ్‌లను బాధితులు తమ మొబైల్‌ ఫోన్లలో స్కాన్‌ చేసి ఉన్నతాధికారులకు ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వవచ్చు. పోలీస్‌ స్టేషన్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాలతో పాటు స్టేషన్‌కు ఫిర్యాదుతో వెళితే సరైన సమయంలో స్పందించి తమకు న్యాయం చేసిన అధికారులను అభినందిస్తూ కూడా క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా తెలియజేయవచ్చు. ప్రజలు క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా తెలియజేసిన అభిప్రాయాలు నేరుగా పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులకు వెళ్తాయి. తరుచూ ఫిర్యాదులు వచ్చే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాగా పనిచేస్తున్న అధికారులను అభినందించవచ్చు.

పోలీస్‌స్టేషన్లలో కొత్తగా ఏర్పా టు చేసిన క్యూ ఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి ప్రజలు పోలీసులపై తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. బాధితులు వెల్లడించిన అభిప్రాయాలు స్థానిక పోలీసులకు తెలిసే అవకాశం లేదు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంకా మెరుగైన సేవలు అందించడానికి పోలీస్‌శాఖకు తోడ్పడతారని ఆశిస్తున్నా.

–శ్రీనివాస్‌రావు, డీఎస్పీ ఎల్లారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement