పిల్లలకు మంచి భోజనం అందాలని..
బడిలో పాఠం..
ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కలెక్టర్‌గా ఆశిష్ సంగ్వాన్ 2024 జూన్ 16న బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఆయన రెగ్యులర్‌గా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. వారంలో ఒకటి రెండు రోజులు తప్పనిసరిగా గ్రామాలను సందర్శిస్తారు. జిల్లా కేంద్రానికి సుమారు నూరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జుక్కల్, మద్నూర్, బిచ్కుంద మండలాలకు సైతం ఆయన వెళ్లి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
స్కూళ్లు, ఆస్పత్రుల తనిఖీ..
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటనల్లో భాగంగా జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా స్కూళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేస్తారు. అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తారు. అందుతున్న సేవలను అడిగి తెలుసుకుంటారు. ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లినపుడల్లా తరగతి గదుల్లోకి వెళ్లి కాసేపు టీచర్ అవతారం ఎత్తుతారు. విద్యార్థులకు పాఠాలు చెబుతారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు సంధిస్తారు. సరైన సమాధానం ఇస్తే మెచ్చుకుంటారు. తప్పుగా చెబితే ఆ అంశంపై అవగాహన కల్పిస్తారు. పిల్లలకు నోట్ బుక్స్, పెన్స్ ఇస్తుంటారు. స్కూళ్లే కాదు గురుకుల పాఠశాలలు, కస్తూర్బా పాఠశాలలు, అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకూ వెళతారు.
ఆర్భాటాలకు దూరంగా ఉంటూ..
హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండే కలెక్టర్.. నెలలో కనీసం పది రోజులు వివిధ మండలాల పర్యటనకు వెళ్తారు. జిల్లాకేంద్రానికి దగ్గరలోని ప్రాంతాలకు వెళ్లినపుడు మధ్యాహ్నంలోపు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. దూరాన ఉన్న మండలాలకు వెళ్లినపుడు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు లేదంటే గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళతారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తారు. భోజన మంత్రాన్ని పఠిస్తారు.
ఆయన ఇప్పటివరకు 80 పర్యాయాలు ప్రభు త్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లకు వెళ్లారు. 32 పర్యాయాలు పిల్లలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అలాగే రెండు మూడు పర్యాయాలు రాత్రి పూట హాస్టళ్లను తనిఖీ చేశారు. అక్కడే విద్యార్థులతో కలిసి డిన్నర్ ఆరగించారు. ఇలా విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ద్వారా పిల్లలకు అందుతున్న మధ్యాహ్న భోజనం ఎలా ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు.
వారంలో ఒకటి రెండు రోజుల
క్షేత్రస్థాయి పర్యటన
తప్పనిసరిగా పాఠశాలల సందర్శన
చదువుల తీరును తెలుసుకునే ప్రయత్నం
పిల్లలతో కలిసి భోజనం చేయడానికి ప్రాధాన్యత
ఆదర్శంగా నిలుస్తున్న కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తరచూ పాఠశాలలను సందర్శిస్తుంటారు. కాసేపు టీచర్‌గా మారి, పిల్లలకు పాఠాలు చెబుతారు. అభ్యసన సామర్థ్యాలను పరీక్షిస్తారు. వారితోపాటే భోజనం చేస్తారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి భోజనం అందాలన్నదే తన తపన అని, అందుకే తరచూ బడులను సందర్శిస్తానని ఆయన పేర్కొంటారు.
జిల్లాలో అన్ని ప్రాంతాల్లోని స్కూళ్లను రెగ్యులర్‌గా విజిట్ చేస్తున్నాను. మధ్యాహ్న భోజనం సమయంలో వెళ్లినపుడు కచ్చితంగా పిల్లలతో కలిసి భోజనం చేస్తాను. స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో భోజనంలో నాణ్యత ఏమేరకు ఉందో తెలుసుకోవడానికి ఇది దోహదపడుతోంది. భోజనం ఎలా పెడుతున్నారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది తెలిసిపోతుంది. పిల్లలతో ఇంటరాక్ట్ అవడం వల్ల వారు చాలా విషయాలు చెబుతారు. వారిని మోటివేట్ చేస్తూ ప్రయోజకులు కావాలని సూచిస్తాను.
– ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డి


