వడగండ్ల వర్షంతో పంటలకు నష్టం | - | Sakshi
Sakshi News home page

వడగండ్ల వర్షంతో పంటలకు నష్టం

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

మద్నూర్‌: సుల్తాన్‌పేట్‌, మారెపల్లి, మల్లాపూర్‌ గ్రామాల్లో శనివారం భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. భారీ ఈదురు గాలులతో మామిడికాయలు రాలిపోయాయని రైతులు తెలిపారు. జొన్న, మక్క పంటలు నేలకొరిగాయని పేర్కొన్నారు. సుల్తాన్‌పేట్‌లో నూర్పిడి అనంతరం కుప్ప చేసిన మక్కలు తడిసిపోయాయని సర్పంచ్‌ రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు.

మంజీర తీరంలో రాళ్ల వాన

బోధన్‌: మంజీర నది తీరంలో సాలూర మండల కేంద్రం, ఖాజాపూర్‌, హున్సా, మందర్నా గ్రామా ల్లో శనివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు, వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించాయి. ఈ నాలుగు గ్రామాల్లో యాసంగి సీజన్‌లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశారు. పంటలు కోత దశకు చేరాయి. సాలూరలో వరి కోతలు ప్రారంభం కాగా ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. హున్సా గ్రామ రైతులు వంద ఎకరాలకు పైగా అరటి సాగు చేశారు. వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు సేవా కేంద్రం ఆవరణలో, అంతర్రాష్ట్ర బైపాస్‌ రోడ్డు మార్గం, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వర్షం నుంచి రక్షణకు ఆరబెట్టిన ధాన్యంపై కవర్‌లు కప్పుతూ రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈదురు గాలులకు మొక్కజొన్న నేలవాలింది. వరి పంటకు గింజ రాలిపోయింది. పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షం వల్ల రైతులు విలవిలలాడుతున్నారు. మరో నాలు గు రోజులు భారీ ఈదురు గాలులు, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆందోళన నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement