క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

దారి దోపిడీ కేసులో ఒకరు.. యువకుడి ఆత్మహత్యాయత్నం

హత్య కేసులో నిందితుడి అరెస్టు

కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో ఘటన

రెండు నెలలకు పోలీసులకు చిక్కిన నిందితుడు

కామారెడ్డి క్రైం: రెండు నెలల కిత్రం సెల్‌ఫోన్‌, నగదు కాజేసే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి హత్య చేసి, పరారైన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కామారెడ్డి సబ్‌ డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్‌లోని ఎంక్వయిరీ కౌంటర్‌ వద్ద ఫిబ్రవరి 12న రాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మధ్య ఫోన్‌ విషయంలో వాగ్వాదం మొదలైంది. ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌, నగదు కాజేసే ఉద్దేశంతో మరో వ్యక్తిపై అందరూ చూస్తుండగానే దాడి చేశాడు. బాధితుడికి ముఖం, ఛాతీపై తీవ్రమైన గాయాలు కావడంతో కిందపడిపోయి మృతి చెందాడు. వెంటనే మృతుడి వద్దనున్న సెల్‌ఫోన్‌, రూ.300 నగదును దోచుకుని నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడి ఆనవాళ్లు కనిపించాయి. కానీ హత్యకు గురైన, హత్యకు పాల్పడిన ఇద్దరి వివరాలు లభించలేదు. కొద్దిరోజులకు మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. అతడు కొంత కాలంగా కామారెడ్డిలో కూలీపనులు చేసకుంటూ జీవించేవాడని తేలింది. కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో శనివారం నిందితుడి కదలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని మహారాష్ట్రలోని అర్నితలోక్‌ యవత్మాల్‌ జిల్లా పంగిడి గ్రామానికి చెందిన ఆకాష్‌ నాగూరావ్‌ కోవెగా గుర్తించామన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఏఎస్సై రంగారావు, కానిస్టేబుళ్లు కమలాకర్‌, రాజు, సంపత్‌లను, నిందితుడి సమాచారం ఇచ్చిన షేక్‌ సద్దాం అనే వ్యక్తిని అభినందించారు.

కామారెడ్డి క్రైం: నాలుగు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ దారి దోపిడీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సబ్‌ డివిజనల్‌ పోలీసు కార్యాలయంలో శనివారం ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న పట్టణంలోని ఇందిరానగర్‌ కా లనీకి చెందిన గోలి సుదీప్‌ కుమార్‌ రామారెడ్డి రోడ్డులోని చర్చి సమీపం నుంచి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి అతడిని అడ్డగించాడు. కత్తితో బెదిరించి రూ.2వేలు లాక్కున్నాడు. అంతేకాకుండా ఫోన్‌పే ద్వారా మరో రూ. 8వేలు అతడి ఖాతాకు బదలాయించుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. నిందితుడిని అదే కాలనీకి చెందిన శివరాత్రి నవీన్‌గా గుర్తించారు. శనివారం అతడిని గంజ్‌ గేటు వద్ద అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే అతడి వద్ద నుంచి ఓ బైక్‌, కత్తి, మొబైల్‌ ఫోన్‌, రూ.8వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

సీపీఆర్‌ చేసి, ప్రాణాలు కాపాడిన పోలీసులు

రుద్రూర్‌: కోటగిరి మండల కేంద్రంలోని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా.. కోటగిరిలోని వినాయకనగర్‌కు చెందిన పిల్లి సంజీవ్‌ (30) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శనివారం అతడు తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్‌ ఇలియాస్‌, హోంగార్డు సుధాకర్‌ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఉరి తాడును తీసివేసి సంజీవ్‌కు సీపీఆర్‌ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలిచాయని స్థానికులు వారిని అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement