రుద్రూర్: హార్వెస్టర్‌ను శుభ్రం చేస్తుండగా ఓ డ్రైవర్ అనుమానాస్పదస్థితి మృతి చెందిన ఘటన కోటగిరిలో చోటుచేసుకుంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిషిపాల్ కోషిందర్, మనోజ్ కుమార్ (డ్రైవర్)లు హార్వెస్టర్ డ్రైవర్లుగా పనిచేయడానికి కామారెడ్డి జిల్లా బీర్కూర్‌కు వచ్చారు. గురువారం ఉదయం మనోజ్ కుమార్ హార్వెస్టర్‌ను తీసుకొని, మన్నె శ్రీకాంత్‌తో కలిసి కోటగిరి వచ్చారు. కోటగిరిలోని వాటర్ సర్వీస్ సెంటర్‌లో హార్వెస్టర్‌ను శుభ్రం చేస్తుండగా మనోజ్ కుమార్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై రిషిపాల్ కోషిందర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.
ఫ్లైవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం
● సుమారు రూ.కోటి ఆస్తి నష్టం
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున ప్లైవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం జరుగగా, సుమారు రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగింది. విద్యుత్‌నగర్‌కు చెందిన వడ్ల బాలచంద్రం తన సొంత భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్లైవుడ్ వర్క్‌షాప్ నిర్వహిస్తుండగా పైఅంతస్తులో నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున ఆకస్మాత్తుగా షాప్ నుంచి పొగ రావడంతో స్థానికులు గమనించి బాల్‌చంద్రం కుటుంబానికి సమాచారం అందించారు. వారు వెంటనే బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. షాప్‌లోని ప్లైవుడ్, అల్యూమినియం ఫ్రేమ్‌లు, ఇతర సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయని బాధితుడు బాల్‌చంద్రం, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. మంటలకు భవనం మొత్తం బీటలు వారినందున ఏ మేరకు పటిష్టంగా ఉందనే విషయం ఇంజినీర్లతో పరీక్షలు చేయించాలని అగ్నిమాపకదళ అధికారులు సూచించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాల్‌చంద్రం, కాలనీవాసులు కోరారు.
ఎండ్రియాల్‌లో చైన్ స్నాచింగ్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో గురువారం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బానాల అనసూయ అనే మహిళ ప్రతిరోజు మాదిరిగానే గురువారం ఉదయం 4 గంటలకే నిద్ర నుంచి లేచి తన ఇంటి ముందు వాకిలిని ఊడ్చడానికి బయటకు వచ్చింది. ఇదే అదునుగా గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు నిద్ర నుంచి లేచి బయటకు వచ్చేసరికి దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితురాలు తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు.


