● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ
దోమకొండ: గ్రామీణాభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి వివరంగా తెలియజేశారు. గ్రామసభలో భాగంగా గ్రామస్తులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారిస్తామన్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో మెడికల్ కాలేజీల అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దోమకొండలో మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటు, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ మధుమోహన్, గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిరుమలగౌడ్, భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జిల్లా ఉధ్యాన అధికారి జ్యోతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాచారెడ్డి మాజీ ఎంపీపీ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.
త్వరలో 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
దోమకండ: మండల కేంద్రంలో త్వరలో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం దోమకొండలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన 50 పడకల ఆస్పత్రి స్థల పరిశీలన చేసి విలేకరులతో మాట్లాడారు. గతంలో గ్రామ పంచాయితీ తీర్మానం చేసి కేటాయించిన భూమిని పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. అన్ని అనుమతులు పూర్తి చేసి మరో 10 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.


