భజనలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్న భక్తులు
జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న భక్తులు
కామారెడ్డి టౌన్ : జిల్లాలో గురువారం హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పలుచోట్ల వీరహనుమాన్ విజయయాత్రలు నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డిలలో శోభాయాత్రలు వైభవంగా సాగాయి. పుర వీధులు హనుమ నామ స్మరణతో మారుమోగాయి. జిల్లా కేంద్రంలో కోడూరు హనుమాన్ ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ.. పెద్ద బజార్, నిజాంసాగర్ చౌరస్తా, నిజాంసాగర్ రోడ్, జన్మభూమి రోడ్, కొత్త బస్టాండ్, అశోక్‌నగర్ కాలనీ, రైల్వే గేట్, పంచముఖి హనుమాన్ ఆలయం, పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్ మీదుగా సాగి తిరిగి కోడూరు హనుమాన్ ఆలయం వద్ద ముగిసింది. ర్యాలీ ఆద్యంతం భక్తులు భజనలు చేస్తూ, పరవశిస్తూ నృత్యం చేశారు. పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


