కామారెడ్డి టౌన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘పరివర్తన’ ప్రాజెక్టులో భాగంగా రామ్‌కీ ఫౌండేషన్ సహకారంతో డిజిటల్ టీవీలను జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నూతన డిజిటల్ టీవీ ప్యానల్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మొత్తం 40 టీవీలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వీటికి అదనంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మరో 80 టీవీ ప్యానల్స్‌ను కేటాయించారని తెలిపారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ నరేష్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లా వ్యాప్తంగా గురువారం 31 మందికి శిక్షలు విధించారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపరుచగా నలుగురికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 31 మందికి రూ.34 వేల జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.


