‘ఖైదీలకు న్యాయ సహాయం అందేలా చూడాలి’
కామారెడ్డి టౌన్ : ఖైదీల మానవ హక్కుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన వారికి న్యాయ సహాయం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి టి.నాగరాణి ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును సమీక్షించారు. అనంతరం ఖైదీలతో ప్రత్యక్షంగా సమావేశమై వారికి ఉన్న చట్టపరమైన హక్కులు, డీఎల్‌ఎస్‌ఏ ద్వారా లభించే వివిధ ఉచిత సేవలపై అవగాహన కల్పించారు. జైలు వంటగది, పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రతపై ఆరా తీశారు. ఫిర్యాదు పెట్టెలను తనిఖీ చేసి, ఖైదీల సమస్యల పరిష్కారానికి తగిన సూచనలిచ్చారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మాయ సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్ సంజీవ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. ‘జాతీయ విద్యా విధానం–2020’ పై నిర్వహించే సదస్సుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు జయప్రకాశ్, సుధాకర్, శ్రీనివాస్‌రావు, రాజేందర్, కవిత తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: కేంద్రం ఇచ్చిన నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డిలో అమృత్ 2.0 పనులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.30 కోట్లతోనే జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 140 మున్సిపాలిటీలకు రూ.2,870 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేసిందన్నారు. ఎల్లారెడ్డిలోని మొత్తం 12 వార్డులలో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. అత్యధికంగా సీట్లు సాధించి బల్దియాపై బీజేపీ జెండా ఎగురవేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, రవీందర్‌రావు, బాలకిషన్, నక్క గంగాధర్, నర్సింలు, రాజేష్, వంగపల్లి కాశి, రాంప్రసాద్ తదితరులున్నారు.
‘ఖైదీలకు న్యాయ సహాయం అందేలా చూడాలి’


