రెండో దశ ర్యాండమైజేషన్
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగింది. 239 మంది పీవోలు, 239 మంది ఏపీవోలు, 645 మంది ఇతర పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా మున్సిపాలిటీలను కేటాయించారు. మరికొందరిని రిజర్వ్‌లో ఉంచారు. విదులు కేటాయించిన అధికారులకు బుధవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు అదనపు కలెక్టర్ మధుమోహన్ తెలిపారు. కామారెడ్డి, బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, బాన్సువాడ మున్సిపల్, ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయానికి సమీపంలోని ఏఎంసీ గోదాం, బాన్సువాడ డిగ్రీ కళాశాల, బిచ్కుంద మార్కెట్ యార్డు, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, సీపీవో రఘునందన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


