ప్రకృతి వనంలో చెట్లపై గొడ్డలి వేటు
నిజాంసాగర్(జుక్కల్): అచ్చంపేట గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనానికి 2021లో రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో 31 వేల మొక్కలు నాటారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కోసం ప్రకృతి వనం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి, నీటి సదుపాయాన్ని కల్పించారు. నాలుగైదు సంవత్సరాల పాటు బృహత్ పల్లె ప్రకృతి వనం చెట్లు పచ్చదనంతో కళకళలాడాయి. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన రావడంతో పల్లెప్రకృతి వనాల నిర్వహణ చూసే నాథుడు కరువయ్యారు. దాంతో గ్రామాల్లోని బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పాటు వన నర్సరీల నిర్వహణను గాలికొలిదిలేశారు. అచ్చంపేట బృహత్ పల్లె ప్రకృతి వనంలోని చెట్లను నరకడంతో పాటు కలపను అక్కడే నిల్వ చేసి, ట్రాక్టర్లలో ఇళ్లకు తరలిస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి పల్లె ప్రకృతి వనాలు, వన నర్సరీల నిర్వహణపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


