మొరం టిప్పర్ల అడ్డగింత
డొంకేశ్వర్: మండలంలో మొరం తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. జీజీ నడ్కుడ, చిన్నయానం, గాదేపల్లి ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీగా మొరం తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. టిప్పర్లు వేగంగా వెళ్లడంతో రోడ్లు పాడవడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లను శుక్రవారం చిన్నయానం గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. ఊరిలో నుంచి వెళ్లడంతో దుమ్ము ఇళ్లలోకి వస్తోందని, వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులు, కూలీలు రోడ్డుపైకి రావాలంటేనే భయమేస్తోందని చెబుతున్నారు. అయితే మొరం తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా అని రెవెన్యూ, పంచాయతీ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నారు. కాగా ఆయిల్‌పాం చెట్ల కోసం మట్టిని చేపూర్ నర్సరీకి తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చామని హర్టికల్చర్ డీడీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. దీనిపై స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.


