అభివృద్ధిని పక్కనపెట్టిన ఎమ్మెల్యే
మంత్రి ఉత్తమ్‌తో సమావేశం
● ఓట్లకోసం వస్తే ప్రజలు నిలదీయాలి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
● జిలా కేంద్రంలో రూ. 2.5 కోట్ల
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే.. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పట్టణ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 19, 42, 43, 48, 49 వార్డులలో రూ. 2.5 కోట్లతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం, అమృత్ పథకం కింద తాగునీటి పైపులైన్ల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పట్టణ అభివృద్ధికి ఆయన ఒక్క రూపాయి కూడా కేంద్రంనుంచి తీసుకురాలేకపోయారని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా అందరినీ సమదృష్టితో చూడాల్సింది పోయి కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ వర్గ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. సొంత నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలంతా ఆయనను నిలదీయాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి టౌన్: నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మార్గమధ్యలో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోగల దేశాయ్ బీడీ కంపెనీ గెస్ట్ హౌస్‌లో కాసేపు సేదతీరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయనతో సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రాబోయే మున్సిపల్ ఎన్నికలతోపాటు జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై చర్చించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారని షబ్బీర్ అలీ తెలిపారు.
అభివృద్ధిని పక్కనపెట్టిన ఎమ్మెల్యే


