కాంగ్రెస్‌లో పోటాపోటీ!
● కామారెడ్డి బల్దియాలో 49 వార్డులకు 195 దరఖాస్తులు
● ఒక్కో వార్డులో నలుగురైదుగురు ఆశావహులు
● టికెట్టు కోసం ప్రయత్నిస్తూనే ప్రచారం..
● అవకాశం రాకుంటే రెబల్‌గా పోటీ చేయడానికీ రెడీ
అధికార కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల జోష్ కనిపిస్తోంది. షెడ్యూల్ వెలువడకముందే ఆ పార్టీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించింది. కామారెడ్డి బల్దియాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో వార్డునుంచి నలుగురైదుగురు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పార్టీ టికెట్టు దక్కకపోతే ఇండిపెండెంట్‌గానైనా బరిలో ఉంటామని పలువురు పేర్కొంటున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. పంచాయతీలు, బల్దియాలతో పాటు మండల, జిల్లా పరిషత్ పదవులపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికలతో కొందరు గ్రామ స్థాయి లీడర్లు సర్పంచ్‌లుగా, ఉపసర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. మున్సిపల్‌తోపాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వచ్చేనెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ రావడమే తరువాయి అన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో పట్టణాల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయాలన్న ఆశతో ఉన్న నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద ఉన్న పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో టికెట్టు ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 49 వార్డుల్లో పోటీ చేయడానికి 195 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణంలోని నాలుగో వార్డులో అత్యధికంగా 11 మంది టికెట్టు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. చాలా వార్డుల్లో పోటీ తీవ్రంగానే ఉంది. దాదాపు అన్ని వార్డుల్లోనూ టికెట్లు ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీ నేతలకు సవాల్‌గా మారనుంది. అలాగే ఇదే సమయంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తన వర్గీయులతో దరఖాస్తులను పార్టీ జిల్లా కార్యాలయంలో ఇప్పించారు. దీంతో ఆయా వార్డుల్లో పార్టీ టికెట్ల కోసం పోటీ మరింత ఎక్కువగా ఉండనుంది.


