సీఎంఆర్ లెక్కలపైనే ఏసీబీ ఫోకస్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో కస్టం మిల్లింగ్ లెక్కలపైనే ఏసీబీ ఫోకస్ చేసింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారుల్లో వణుకు మొదలయ్యింది. ఏసీబీ అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పౌరసరఫరాల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.. మిల్లులకు ధాన్యం కేటాయింపులు, బియ్యం రికవరీకి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బ్లాక్‌లో ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయింపులు, తక్కువ సామర్థ్యం ఉన్న వాటికీ ఎక్కువ కేటాయించడం వంటి అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. పది పన్నెండు గంటల పాటు ఏసీబీ అధికారులు పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో రికార్డులన్నింటినీ పరిశీలించిన విషయం తెలిసిందే. కస్టం మిల్లింగ్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పడిన నాటి నుంచి డీఎంలు, డీఎస్‌వోలుగా పనిచేసిన అధికారులు ధాన్యం కేటాయింపు, బియ్యం రికవరీ విషయంలో ఎవరు ఎలా వ్యవహరించారన్న దానిపై అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. తనిఖీల సమయంలో అధికారులు, సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. అలాగే లోనికి ఎవరినీ అనుమతించలేదు. అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫోన్లను కూడా పరిశీలించినట్లు సమాచారం.
సీఎంఆర్‌కు సంబంధించి ధాన్యం కేటాయింపులతో పాటు రైస్ మిల్లర్ల నుంచి తిరిగి బియ్యాన్ని సేకరించడంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారా అన్న కోణంలో ఏసీబీ విచారణ జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలో కొన్ని మిల్లులు పెద్దమొత్తంలో ధాన్యాన్ని దుర్వినియోగం చేశాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. గతంలో బ్లాక్‌లో పెట్టిన మిల్లులకు కూడా ధాన్యం కేటాయింపులు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారులు మొత్తంగా సీఎంఆర్‌పైనే ఫోకస్ చేసి రికార్డులను పరిశీలించారు. పదేళ్ల కాలంలో ఎలాంటి అక్రమాలు జరిగాయన్నది ఏసీబీ అధికారుల విచారణ నివేదికలో తేలే అవకాశాలు ఉన్నాయి. గతంలో ధాన్యం కేటాయింపులు, ఇప్పుడు జరిగిన కేటాయింపులన్నింటిని వారు పరిశీలించడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కేటాయింపులు, రికవరీ
వివరాల పరిశీలన
బ్లాక్‌లో ఉన్న మిల్లులకు ధాన్యం
ఇవ్వడంపై ఆరా
తక్కువ సామర్థ్యం ఉన్న వాటికి
ఎక్కువ కేటాయింపులపైనా..
జిల్లా పౌరసరఫరాల
విభాగంలో వణుకు


