విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయించాలి
కామారెడ్డి టౌన్: బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చింతల లింగం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలను మారుస్తూ ప్రజల మధ్య అంతరాలను పెంచుతున్నారని, దీనివల్ల విద్యా రంగం వెనుకబాటుకు గురవుతోందని అన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్. అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల రక్షణే ధ్యేయంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, వసతులు కల్పించాలని కోరారు. అనంతరం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కె. శ్రీనివాస్, అధ్యక్షులుగా సీహెచ్ లింగం, సహ అధ్యక్షుడిగా పి. విజయరామరాజు, ప్రధాన కార్యదర్శిగా బి.దేవులాతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు. టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శంతన్, తదితరులు పాల్గొన్నారు.


