షెడ్యూల్‌కు ముందే.. | - | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌కు ముందే..

Jan 21 2026 7:07 AM | Updated on Jan 21 2026 7:07 AM

షెడ్య

షెడ్యూల్‌కు ముందే..

షెడ్యూల్‌కు ముందే..

బల్దియాలలో వేడెక్కిన రాజకీయం

వార్డుల్లో ఆశావహుల హడావిడి

ఇంటింటికి వెళ్తూ ముందస్తు ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ వెలువడకముందే పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరైతే ఏకంగా వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. పార్టీలు సైతం మెజారిటీ స్థానాలు కై వసం చేసుకోవడం కోసం ఎత్తులు వేస్తున్నాయి.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లాలో కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు కదనరంగం లోకి దిగాయి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఐదారు రోజులుగా స్థానికంగా ఉంటూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వార్డుల్లో ఆయన పర్యటించారు. పనిలోపనిగా ఇతర పార్టీల నాయకులకు కాంగ్రెస్‌ కండువాలు కప్పుతున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ సమక్షంలో మాజీ కౌన్సిలర్లు కృష్ణమోహన్‌, ముప్పారపు ఆనంద్‌తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్‌ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బుధవారం పట్టణ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పార్టీ నేతలతో సమావేశమై అభ్యర్థిత్వాల గురించి పరిశీలిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురిని బీజేపీలో చేర్చుకుంటున్నారు. మూడు పార్టీలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తూ మెజారిటీ స్థానాలను కై వసం చేసుకోవడం కోసం పావులు కదుపుతున్నాయి.

వార్డుల్లో సందడి

మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలవడానికి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులంతా తమతమ వార్డుల్లో హడావిడి చేస్తున్నారు. తమకు పార్టీ టికెట్టు వస్తుందని కొందరు నమ్మకంతో ప్రచారం మొదలు పెట్టగా మరికొందరు టికెట్టు రాకున్నా సరే పోటీ చేసుడే అంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. చాలాచోట్ల ఆశావహులు వార్డుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తాము బరిలో ఉంటామని చెబుతున్నారు. కొందరు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపిస్తూ, ఫోన్‌లు చేస్తూ తమకు అండగా నిలవాలని మాట తీసుకుంటున్నారు. మరికొందరు కుల సంఘాలు, గల్లీ సంఘాలు, కమ్యూనిటీ బోర్‌వెల్‌ కమిటీలు... ఇలా కమ్యూనిటీ ఓట్లపై కన్నేసి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. కొన్ని వార్డుల్లో ఒకే పార్టీనుంచి ముగ్గురు, నలుగురు టికెట్టు ఆశిస్తున్నారు. ఆశావహులు వార్డుల్లో తిరుగుతుండడంతో సందడి నెలకొంది.

షెడ్యూల్‌కు ముందే..1
1/1

షెడ్యూల్‌కు ముందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement