‘చక్కెర’ పెరుగుతోంది
● చాపకింద నీరులా
విస్తరిస్తున్న మధుమేహం
● ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
కామారెడ్డి టౌన్: మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి నేపథ్యంలో మధుమేహం(డయాబెటిస్) చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏటా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు.
జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎన్‌సీడీ ప్రోగ్రాంలో భాగంగా పీహెచ్‌సీ, సబ్ సెంటర్‌ల పరిధిలో సర్వే చేశారు. 30 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించారు. 5,59,492 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందులో 5,53,425 మందికి షుగర్ పరీక్ష చేయగా.. 63,979 మందికి మధుమేహ వ్యాధి ఉన్నట్లు తేలింది. పరీక్షలు చేసినవారిలో 11.56 శాతం మందికి షుగర్ ఉండడం గమనార్హం.
జిల్లాలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఎన్‌సీడీ ప్రోగ్రాంలో భాగంగా షుగర్, బీపీ పరీక్షలు చేస్తున్నాం. ప్రతినెల మందులను ఉచితంగా అందిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ జీవన శైలిని మార్చుకోవాలి. ప్రతిరోజు నడక, వ్యాయామం, యోగాసనాలు చేయాలి.
– విద్య, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే మధుమేహం వచ్చినట్లుగా నిర్థారిస్తారు. షుగర్ లెవల్స్ మోతాదులో ఉండాలి. పరిగడుపున 90 నుంచి 110, ఆహారం తిన్న తర్వాత 90 నుంచి 140 లోపు ఉండడం సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. వాతావరణ కాలుష్యం, తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, తీసుకునే చక్కెర.. ఇలా ఏదైనా కారణంతో రక్తపోటుతో పాటు మధుమేహం వస్తున్నాయి. ఇక కుటుంబంలో తల్లిదండ్రులకు షుగర్ ఉంటే వంశపారంపర్యంగా సంతానానికి ఈ వ్యాధులు వస్తున్నాయి. చాలామంది 30 దాటగానే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం వ్యాధి బారిన పడినవారు ఉదయం తప్పకుండా వాకింగ్ చేయాలని, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మిగతా అవయవాల మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
పరీక్షలు చేయించుకున్న
30 ఏళ్లపైబడినవారు 5,53,425
మధుమేహం నిర్ధారణ అయినవారు 63,979
శాతం 11.56
‘చక్కెర’ పెరుగుతోంది


