జుక్కల్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
పెద్దకొడప్‌గల్: బేగంపూర్ తండా మీదుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బేగంపూర్ తండాలో ఆగకపోవడంతో తండావాసులు ఆగ్రహానికి గురయ్యారు. తిరుగు ప్రయాణంలో ఆయనను అడ్డుకుని నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు శుక్రవారం బేగంపూర్ తండాకు ప్రచారానికి వస్తారని బేగంపూర్ సర్పంచ్ అభ్యర్థి తండావాసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ తండా సమస్యలు చెప్పుకోవచ్చని తండావాసులు ఆశించారు. అయితే బేగంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తండా మీదుగా కాస్లాబాద్ గ్రామానికి వెళ్తున్న సమయంలో తండాలో ఎమ్మెల్యే ఆగలేదు. దీంతో ఆగ్రహించిన తండావాసులు తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మీ తండాలో ఎందుకు ఆగాలని ఎమ్మెల్యే దురుసుగా ప్రశ్నించడంతో పలువురు యువకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తండాలోకి వెళ్లకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు.


