కల్వర్టులో దిగబడిన లారీ
● కల్వర్టు ప్రమాదకరంగా మారిందని ముందే చెప్పిన ‘సాక్షి’
● పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం
కామారెడ్డి రూరల్: పట్టణంలోని 9వ వార్డు పరిధిలోగల కామారెడ్డి పెద్ద చెరువుకు వెళ్లే దారిలో ఉన్న డ్రైనేజీ కల్వర్టులో ఓ లారీ గురువారం దిగబడిపోయింది. కల్వర్టు ప్రమాదకరంగా మారిందని గత నెల 28న ‘సాక్షి’లో ముందే హెచ్చరించినా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అదే కల్వర్టు గుండా ఇటుక లోడుతో వచ్చిన లారీ దిగబడింది. అంతేకాకుండా లారీ కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో పైనున్న కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. వెంటనే స్థానికులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించగా కరెంట్‌ను గంటపాటు నిలిపివేశారు. ఈ రోడ్డు గుండా ప్రతి రోజు ఉదయం కామారెడ్డి చెరువుకు పలువురు ఈత కోసం బైక్‌లపై వెళ్తూ ప్రమాదాల బారిన పడ్డారు. సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
కల్వర్టులో దిగబడిన లారీ


