అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత
ఒక్కొక్కటిగా చనిపోయాయి
● వైద్యం అందక చనిపోయిన పందులు
● రూ.2 లక్షలు నష్టపోయిన బాధితుడు
● ఆదుకోవాలని వేడుకోలు
నస్రుల్లాబాద్: అంతుచిక్కని వ్యాధితో మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 40 పందులు మృతి చెందాయి. నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎరుకల సాయిలు పందుల పెంపకంతోనే జీవనం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే పందులు పెంచుతున్న తరుణంలో గత వారం పిల్లల పంది మృతి చెందింది. వైద్యుల సలహా మేరకు పలు మందులను వాడారు. ఫలితం లేకపోవడంతో వరుస పెట్టి పిల్లలు సైతం చనిపోయాయి. తాను పోషించుకున్న పందులన్నీ వారం రోజుల్లో చనిపోయాయని, వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై సంబంధిత వైద్యులను సంప్రదించినా చనిపోవడానికి కారణం తెలవడం లేదని బాధితుడు బోరుమన్నాడు.
కనీస వసతులు కరువు..
నస్రుల్లాబాద్ మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కూడా పశువులకు వైద్యం అందించడానికి కనీస వసతులు కరువయ్యాయి. శిథిలావస్థలో ఉన్న భవనం, పెచ్చులూడి పడుతున్న రేకులు, ఏక్షణంలో కూలుతుందో అన్న భయాందోళనలో సిబ్బంది ఉంటున్నారు. ప్రాథమిక కేంద్రంగా మార్చి సరైన వైద్యులను నియమిస్తే రైతులు నష్ట పోకుండా ఉంటారు.
నా జీవనాధారం అయిన పందులన్నీ చనిపోయాయి. ఒక్కొక్కటిగా 40 వరకు పందులు చనిపోయాయి. మందులు తెచ్చినా వృథా అయ్యాయి. వ్యాధి అంతుచిక్కడం లేదని వైద్యులు తెలిపారు. సంబంధిత అధికారులు నన్ను ఆదుకోవాలి. – సాయిలు, బాధితుడు, నస్రుల్లాబాద్
అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత


