ఎదురుచూపులు ఎన్నేళ్లు?
● చేయూత పింఛన్ల కోసం మూడేళ్లుగా నిరీక్షిస్తున్న అర్హులు
● ప్రజాపాలనలో వేలాది మంది దరఖాస్తు
● ఇప్పటికీ మంజూరుకాని పెన్షన్
దోమకొండ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న చేయూత పింఛన్ల కోసం అర్హులు ఏళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. 2022 ఆగస్టు కంటే ముందు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పింఛన్ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబరులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలనలో వేలాది మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు కాలేదని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 10వేల మందికి మొండిచేయి..
2022లో అప్పటి ప్రభుత్వం పింఛన్ అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57కి కుదించింది. దీంతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 17 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అప్పటికే పింఛన్ సైట్‌లో మరో 10 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా 17 వేల మందికి పింఛన్లు మంజూరు చేశారు. మిగతా 10 వేల మంది పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు.
కొనసాగుతున్న స్పౌజ్ పింఛన్లు..
ప్రస్తుతం స్పౌజ్ కేసుల పింఛన్లు మాత్రం కొనసాగుతున్నాయి. భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చేయూత పింఛన్ పొందుతూ మరణిస్తే ఆ పింఛన్‌ను భాగస్వామికి బదిలీ చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. ఈ విభాగంలో అర్హులు దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెలలో పింఛన్ బదిలీ చేస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 5 వేల వరకు పింఛన్లు అందుకుంటున్నారు.
ప్రజాపాలన సందర్భంగా నిర్వహించిన గ్రామసభల్లో పింఛన్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కా నీ ప్రస్తుతం వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో దర ఖాస్తుదారుల వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేదు. జిల్లా అధికారులు, ప్రభుత్వం నుంచి ఆదేశాల వస్తేనే, పింఛన్‌దారుల వివరాలు ఆన్‌లైన్ లో నమోదు చేసి అధికారులకు అందజేస్తాం.
–ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో, దోమకొండ
వెబ్‌సైట్ మూసివేత..
2022 సెప్టెంబరు నుంచి పింఛన్ల దరఖాస్తు వెబ్‌సైట్‌ను మూసివేశారు. ఇప్పటి వరకు వెబ్‌సైట్ తిరిగి ఒపెన్ చేయలేదు. అర్హుల పేర్లు నమోదు చేయాలంటే వెబ్‌సైట్ పనిచేయాల్సి ఉంటుంది. కాని వెబ్‌సైట్ మూసివేతతో అధికారులు పింఛన్‌దార్ల పేర్లను నమోదు చేయడానికి వీలుపడడంలేదు. దీంతో దరఖాస్తులు అధికారులు వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. పాతవారి పేర్లను చూసుకోవడానికి కూడా అవకాశం లేకపోగా, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి సైతం అవకాశం లేకుండా పోయింది.


