ఖాళీలను భర్తీ చేయరు..
● జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో
వేధిస్తోన్న ఆపరేటర్ల కొరత
● ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం
● పట్టించుకోని పాలకులు, అధికారులు
పని భారం తగ్గించరు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత వేధిస్తోంది. అధికారులు మాత్రం ఉన్న సిబ్బందిపైనే అధనపు భారం మోపుతూ పనులను నెట్టుకొస్తున్నారు. దీంతో సిబ్బంది పని భారం పెరగడంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 139 సబ్ స్టేషన్లు..
జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్‌ల పరిధిలో 139 విద్యుత్ సబ్ స్టేషన్‌లు ఉన్నాయి. కాగా ఈ సబ్‌స్టేషన్‌లలో 556 మంది ఆపరేటర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 343 మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగతా 213 ఆపరేటర్లు కావల్సి ఉన్నప్పటికీ అధికారులు ఖాళీల భర్తీపై దృష్టిసారించడం లేదు. ఉన్న ఆపరేటర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఒక్కో ఆపరేటర్ ప్రతీరోజు 24 గంటలపాటు సబ్ స్టేషన్‌లలో అరకొరవ వసతుల మధ్య ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ సబ్‌స్టేషన్‌లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నలుగురు ఆపరేటర్లు డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కరు, లేదా ఇద్దరు మాత్రమే పని చేయాల్సి వస్తోంది.
జిల్లా వ్యాప్తంగా చాలా సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత ఉంది. ఉన్న ఆపరేటర్లే ఒ క్కోసారి 24 గంటల పాటు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. కొన్ని సబ్ స్టేషన్‌లలో వాచ్‌మెన్‌లతోనే ఆపరేటర్ల డ్యూటీలు చేయిస్తున్నారు. వారికి పని భారం పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై న దృష్టిసారించి ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలి.
–హరికృష్ణ, జిల్లా ఆర్టిజన్ జేఏసీ చైర్మన్, కామారెడ్డి
కనీస వసతులు కరువు..
జిల్లా వ్యాప్తంగా చాలా సబ్ స్టేషన్‌లలో కనీస వసతులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి వసతి లేక నీళ్ల కోసం బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చాలా సబ్ స్టేషన్‌లకు ప్రహరీలు కూడా లేవు. పలు సబ్ స్టేషన్‌లలో వాచ్‌మెన్‌లు లేరు. ఉన్నచోట ఆ వాచ్‌మెన్‌లతోనే ఆపరేటర్ల డ్యూటీలు చేయిస్తున్నారు. దీంతో వాచ్‌మెన్‌లకు పనిభారం పెరగడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి పరిష్కారం కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని ఆపరేటర్లు కోరుతున్నారు.


