పత్తి సేకరణకు బ్రేక్!
● సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తున్న జిన్నింగ్ మిల్లుల యజమానులు
● నేటి నుంచి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటన
మద్నూర్‌లోని సీసీఐ సెంటర్‌లో పత్తి
మద్నూర్(జుక్కల్) : మండలకేంద్రంలోని సీసీఐ కొ నుగోలు కేంద్రంలో పత్తి సేకరణకు బ్రేక్ పడనుంది. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు పేర్కొన్నారు. మళ్లీ కొనుగోళ్లను ప్రారంభించే తేదీని ప్రకటించే వరకు పత్తిని తీసుకురావొద్దని రైతులకు సూచిస్తున్నారు.
ఇబ్బందుల్లో రైతులు
మార్కెట్‌లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోతే రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది. పత్తి కొనేవారు లేక ధర తగ్గే ప్రమాదం ఉంది. క్వింటాల్‌కు ప్రస్తుతం రూ. 8100 సీసీఐ చెల్లిస్తుండగా, ప్రైవేట్‌లో రూ.6500 నుంచి రూ.7000 వరకు ఇస్తున్నారు. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారు. జిన్నింగ్ యజమానుల సమస్య పరిష్కారమయ్యేదాకా రైతులు మా ర్కెట్‌కు పత్తి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు రైతు లు, మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకాలు వస్తేనే సమస్య పరిష్కారం కానుంది.
మిల్లర్ల డిమాండ్‌లు ఇవే..
పత్తి కొనుగోళ్ల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏకై క సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు మద్నూర్‌లోనే ఉన్నాయి. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులతోపాటు తమకు ఆటంకంగా మారుతున్నాయని మిల్లుల యజమానులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్‌తో స్లాట్ బుకింగ్, ఎకరాకు ఏడు క్వింటాళ్ల పరిమితితోపాటు తేమ కూడా ఎనిమిది శాతానికి తగ్గించారు. ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట మిల్లుల్లోనే కొనుగోళ్లు చేపట్టడంపై రైతులు, జిన్నింగ్ మి ల్లుల యజమానులు తమ ఉనికిపై ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. కొన్ని మిల్లుల్లోనే విడతల వారీగా కొనుగోళ్లు చేపట్టడంతో కొనుగోళ్లు ప్రారంభించని మిల్లు యజమానులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో అన్ని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టగా, తాజా నిబంధనలు రైతులు, జిన్నింగ్ యజమానులకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.


