నీట మునిగిన ఆశలు! | - | Sakshi
Sakshi News home page

నీట మునిగిన ఆశలు!

Oct 4 2025 2:22 AM | Updated on Oct 4 2025 2:22 AM

నీట మునిగిన ఆశలు!

నీట మునిగిన ఆశలు!

ఐదు వేల ఎకరాలకు పైనే..

సర్వేతోనే సరిపెట్టారు

నెల రోజులుగా తగ్గని మంజీర ప్రవాహం

వేలాది ఎకరాల పంటలు నీటిలోనే

పెట్టుబడులు నష్టపోయిన రైతులు

అందని సర్కారు సాయం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మంజీర పరవళ్లు వేలాది మంది రైతుల ఆశలను ముంచేశాయి. నెల రోజు లుగా తగ్గేదే లేదన్నట్టుగా మంజీర పోటెత్తి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు, ఘనపుం ఆనకట్టల ద్వారా భారీగా వస్తున్న వరదతో మంజీర ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతోంది. దీంతో మంజీర పరీవాహక ప్రాంతా ల్లోని వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. అప్పట్లో భారీ ప్రవాహం వస్తే నాలుగు రోజుల్లో తగ్గిపోయి, పంట తేరుకునేది. అయితే గడిచిన నెల రోజులుగా మంజీర ప్రవాహం తగ్గకపోగా మరింత పెరుగుతూనే ఉంటోంది. దీంతో పొలాల నిండా నీళ్లు నిండి చెరవులను తలపిస్తున్నాయి. పంటల ఆనవాళ్లే కనిపించడం లేదు. దీంతో నీరు తగ్గినా పంట కోలుకునే పరిస్థితి లేదు. దశాబ్దాలుగా మంజీర తీరంలో ముంపు సమస్య రైతాంగాన్ని వేధిస్తోంది. జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌, మహ్మద్‌నగర్‌, పిట్లం, బిచ్కుంద తదితర మండలాలను ముంపు సమస్య వెంటాడుతోంది. ప్ర ధానంగా నాగిరెడ్డిపేట మండలంలో ముంపు సమ స్య తీవ్రంగా ఉంటోంది. నాగిరెడ్డిపేట మండలంలోని గోలిలింగాల, మాల్తుమ్మెద, చీనూర్‌, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, వెంకంపల్లి, తాండూర్‌, మాటూర్‌, మాసన్‌పల్లి, ఆత్మకూర్‌, జలాల్‌పూర్‌ గ్రామాలతోపాటు ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన పంటలు నీట మునిగాయి. రోజురోజుకూ పెరుగుతున్న నీటి ప్రవాహంతో నీరు మరింతగా విస్తరించి మరిన్ని పొలాలు నీట మునుగుతున్నాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తి రోజూ లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదు లుతున్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండడం, నిజాంసాగర్‌ ప్రాజెక్టు వెనుకభాగంలో నీరు తన్నడంతో ఆయా గ్రామాల పరిధిలోకి నీరు చొచ్చుకువచ్చి పొలాలను ముంచెత్తింది.

నాగిరెడ్డిపేట మండలంలోని 12 గ్రామాల పరిధిలో దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటలు మంజీర నీటిలో మునిగాయి. నెల రోజులుగా పొలాల నిండా నీళ్లున్నాయి. కొన్ని చోట్ల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. అలాగే ఎల్లారెడ్డి, పిట్లం, మహ్మద్‌నగర్‌, నిజాంసాగర్‌, బిచ్కుంద మండలాల పరిధిలో దాదాపు రెండు వేల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నట్టు అంచనా. మొత్తంగా ఐదు వేల ఎకరాలకు పైగా పొలాలు మంజీర ప్రవాహంలో మునుగుతున్నాయని స్పష్టమవుతోంది. నాలుగు రోజులు నీరు నిలిచి వెళ్తే పెద్దగా ఇబ్బంది ఉండదని, కానీ నెల రోజులు గడచినా నీరు పొలాల్లోనే నిలిచి ఉండడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల వరి పంట దెబ్బతిన్నది. దీంతో రైతులు పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పంట పొట్ట దశలోకి వచ్చిన సమయంలో మంజీర ప్రవాహం కారణంగా నాశనమై పెట్టుబడులు కూడా కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించనున్న హరీశ్‌రావు

రేపు నాగిరెడ్డిపేట మండలంలో పర్యటన

భారీ వర్షాలు, మంజీర ప్రవాహంతో నీట మునిగిన పంటలను బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావ్‌ ఈ నెల 5వ తేదీన పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆయన నాగిరెడ్డిపేట మండలంలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాకు సీఎం వచ్చి వెళ్లినా రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.

గలగల పారుతూ కనువిందు చేయాల్సిన మంజీర నది.. రైతు కంటి మీద కునుకు లేకుండా చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ భూముల్లోకి దూసుకొచ్చిన మంజీర.. పంట పొలాలను తనలో కలిపేసుకుంది. నీట మునిగిన పంటలు నెల రోజులవుతున్నా బయటికి కనిపించకపోవడంతో ఇక తాము మునిగినట్టేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement