
యథేచ్ఛగా అక్రమ నియామకాలు!
సక్రమంగానే జరిగాయి..
విచారణ జరపాలి..
నిజామాబాద్‌అర్బన్: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో అక్రమ నియామకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఏజెన్సీతో కుమ్మకై న ఇద్దరు అధికారులు నియమ, నిబంధనాలను తుంగలో తొక్కి ఈ అక్రమ నియామకాలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ, అర్హులకు అన్యాయం చేస్తూ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహరం గత కొనేళ్లుగా సాగుతోందని సమాచారం. ఇటీవల పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారు అర్హత ఉండి ఉద్యోగం రాలేదని అనుమానంతో ఆరా తీయగా ఈ అక్రమాల నియామకాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ పరిస్థితి..
మైనారిటీ సంక్షేమ శాఖలో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో కళాశాలలో, పాఠశాలలో బోధన, బోధ నేతర సిబ్బందిని అవసరం మేర నియమించేందుకు అవకాశం ఉంది. సంబంధిత శాఖకు అగ్రిమెంట్ అయి ఉన్న అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుపుతారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, తుది నివేదికను సిద్ధం చేసి అర్హులకు ఉద్యోగం కల్పించాల్సి ఉంది. కానీ ఇది కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
● కొన్ని రోజుల క్రితం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో ఓ ఉద్యోగి ఔటోసోర్సింగ్‌లో నియమించబడ్డాడు. ఎలాంటి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దరఖాస్తులు స్వీకరించలేదు. ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు కూడ చేసుకోలేదు. ఓ అధికారి ఖాళీ పోస్టు భర్తీ కోసం మరో అధికారికి లేఖ పంపి ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం చేపట్టారు. సదరు అభ్యర్థి నుంచి రూ.1,50,000 వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు అధికారులు ఒక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు వాటాలుగా పంచుకున్నారని తెలిసింది.
● మే నెలలో ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని ఎలాంటి నోటిస్ లేకుండానే తొలగించారు. కానీ సదరు ఉద్యోగికి సంబంధించిన వేతనాన్ని రూ.45000 ఓ అధికారి వాడుకున్నారు. ఈ విషయమై బాధితుడు ప్రశ్నిస్తే ఇదే స్థానంలో మరొక పనికి డబ్బులు వాడినట్లు తెలిసింది. వాస్తవానికి ఒక ఉద్యోగి వేతనాన్ని అనుమతి లేకుండా వాడుకునే నిబంధన లేనేలేదు.
● కొన్ని రోజుల క్రితం అవుట్‌సోర్సింగ్ పద్ధతిన జూనియర్ లెక్చరర్ నియామకాలు చేపట్టారు. ఇందులో ఓ అభ్యర్థికి మూడు సంవత్సరాల అనుభవం, పీజీ పూర్తి చేసి ఉండగా, ఈమెను కాదని కేవ లం బీఈడి చేసి రెండు సంవత్సరాల అనుభవం ఉన్న మరో అభ్యర్థికి ఉద్యోగం కల్పించారు. ఇందులో ఓ అధికారి సుమారు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
● గత నియామకాలకు సంబంధించి కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోకున్నా.. వారిని జిల్లాలోని నాగారం ప్రాంతంలో జూనియర్ లెక్చరర్‌గా నియమించారు. దీనిపై జిల్లాకు చెందిన ఓ యువతి సమాచార హక్కు చట్టం కింద వివరణ కోరగా నేటికీ సమాచారం ఇవ్వడం లేదు.
● అంతేకాక గత జులైలో నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో దరఖాస్తు సమయానికి నిరుద్యోగులు దరఖాస్తులు ఇవ్వలేదు. కానీ ఇద్దరిలో ఒకరిని బోధన్‌లో మరొకరిని నాగారంలో నియమించారు. ఇందులో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఏజెన్సీల నిర్వహణపై అధికారం ఉన్న మరో ఉద్యోగి సహకరించినట్లు తెలుస్తోంది.
● మైనార్టీ సంక్షేమ శాఖలో ఎక్కడైన పోస్టు ఖాళీగా ఉంటే, భర్తీ కోసం ఉద్యోగి కావాలని శాఖ అధికారులు ఉపాధి కల్పన శాఖ అధికారికి నివేదిస్తున్నారు. దానిని సంబంధిత ఏజెన్సీకి సమాచారం అందిస్తున్నారు. ఉపాధి కల్పన అధికారి ఏజెన్సీ నుంచి ఉద్యోగిని కోరుతున్నట్లు మరో నివేదిక ఇస్తున్నారు. ఇలా ముగ్గురు కలిసి తమకు సంబంధించిన వ్యక్తిని నియమించుకుంటారు. ఉద్యోగం పొందిన వ్యక్తి నుంచి ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసి ఇద్దరు అధికారులకు వాటాలు పంచుతున్నారు. ఇలా ఇప్పటివరకు 20 నుంచి 30 వరకు ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నియామకాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నియామకాలు జరుగుతున్నాయి. మేము కేవలం దరఖాస్తుల పరిశీలన చేసి పంపుతాము. ఇప్పటి వరకు జరిగిన నియామకాలు సక్రమంగానే జరిగాయి. కొందరు ఉద్యోగ నియామకాల్లో అక్రమలు జరిగినట్లు ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటాం.
– కృష్ణవేణి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి
మైనారిటీ శాఖలో అక్రమ నియామకాలపై విచారణ జరపాలి. సదు నియామకాలపై సమాచారం అడిగితే సంబంధిత శాఖ వారు స్పందించడం లేదు. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అర్హులకు అన్యాయం చేస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
– రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి
మైనారిటీ సంక్షేమ శాఖలో
అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుడి దందా
డబ్బులు ఇచ్చిన అభ్యర్థులకే
ఉద్యోగాలు
అర్హులకు అన్యాయం చేస్తున్న వైనం