
క్రైం కార్నర్
నిజామాబాద్ లీగల్: హత్యాయత్నం కేసులో ఒకరికి నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి సాయి సుధా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా భక్తపూర్‌కు చెందిన షకీల్ తాగుడుగు బానిసై నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో సంచరించేవాడు. 18 అక్టోబర్ 2021న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌ఎస్ వైన్స్ వద్ద మద్యం తాగి గొడవచేస్తుండగా, షేక్ జలీల్ అనే వ్యక్తి గొడవ చేయొద్దంటూ షకీల్‌ను బెదిరించాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న షకీల్, జలీల్‌పై దాడిచేయాలని నిర్ణయించుకొని తర్వాతి రోజు కత్తితో వైన్స్ వద్దకు వచ్చాడు. రెండో రోజు సైతం జలీల్ బెదిరించడంతో షకీల్ అతనిపై కత్తితో దాడిచేసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. వైన్స్‌లో పనిచేస్తున్న రమేశ్, సర్ఫరోజ్ ఖాన్ ఇద్దరినీ విడిపించి, జలీల్‌ను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి షకీల్‌ను జైలుకు పంపారు. ఈ కేసులో పోలీసుల తరఫున డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మినర్సయ్య వాదించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు.
వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ సోమవారం తెలిపారు. చందూర్ మండలంలో ఆరేళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
వేల్పూర్: వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద 63 నెంబర్ జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోరుట్ల నుంచి వచ్చిన ఇసుక లారీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

క్రైం కార్నర్