
మోగిన నగారా!
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘స్థానిక’ సమరానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారయ్యింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలో 25 మండలాలకు జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 233 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు, 4,656 వార్డులకు సైతం రెండు విడతల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పాటే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ, కేంద్రాల మ్యాపింగ్ వంటి పనులు పూర్తిచేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
పంచాయతీ ఎన్నికలు...
గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రెండు విడతల్లో జరగనున్నాయి. జిల్లాలో 532 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 4,656 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలయ్యింది. మొదటి విడతలో కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోని 266 పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 17న విడుదలవుతుంది. ఆనాటినుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20 న నామినేషన్లను పరిశీలిస్తారు. 23 న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విరమణకు అవకాశం ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 31న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
రెండో విడతలో గాంధారి, నిజాంసాగర్, పిట్లం, మహ్మద్‌నగర్, జుక్కల్, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని 266 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21 నుంచి 23 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. 27న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువుంటుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తులను ప్రకటిస్తారు. నవంబర్ 4న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇతరులు
13
99087 12421
కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులకోసం హెల్ప్‌లైన్ నంబర్
మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత 14 మండలాల పరిధిలో 14 జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 136 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన పూర్తవుతుంది. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 23న పోలింగ్ జరుగుతుంది.
రెండో విడత 11 మండలాల పరిధిలోని 11 జెడ్పీటీసీ స్థానాలు, 97 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 15 న ముగుస్తుంది. 16న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల విరమణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 27న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండు విడతలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుంది.
పల్లెపోరుకు తెరలేచింది. పరిషత్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యింది. దీని ప్రకారం అక్టోబర్ 23న 14 మండలాల్లో, 27న మిగిలిన 11 మండలాల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 31న 266 పంచాయతీలకు, నవంబర్ 4న మిగిలిన 266 పంచాయతీలకు పోలింగ్ ఉంటుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే కౌంటింగ్ నిర్వహించనుండగా.. పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను నవంబర్ 11న లెక్కించనున్నారు.
జిల్లాలో రెండు విడతల్లో
పరిషత్ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలు కూడా
రెండు విడతల్లోనే...
అమలులోకి ఎన్నికల కోడ్
ఏర్పాట్లలో యంత్రాంగం బిజీ