
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● పక్కాగా ఎన్నికల నియమావళి
అమలు చేయాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
కామారెడ్డి టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం ఆమె హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జిల్లా అధికారులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై పలు సూచనలు ఇచ్చారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్‌రైటింగ్‌లను తొలగించాలన్నారు. ఎన్నికల నిర్వహణపై పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం, డబ్బు లేదా బహుమతులు తదితర కార్యక్రమాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీవో, ఏపీవో, ఆర్‌వో, ఏఆర్‌వోలకు మొదటి విడత శిక్షణ పూర్తి చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. జిల్లాస్థాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను గుర్తించామని, జిల్లాలో అవసరమైన బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీపీవో మురళి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్‌పీవోలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం ఆయన ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.