
అప్పులబాధతో యువకుని ఆత్మహత్య
మాచారెడ్డి: అప్పుల బాధతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చుక్కాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనాచి రమేశ్(32) ఇటీవల ఇంటి నిర్మాణం కోసం ప్రైవేట్ ఫైనాన్స్‌లతోపాటు మహిళా సంఘాల వద్ద అప్పు చేశాడు. మొత్తం రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. మూడు రోజుల కిందట ఫైనాన్షియర్లు ఇంటి విషయంలో ఎలాంటి లావాదేవీలు చేయొద్దని ఇంటికి నోటీస్ అతికించి వెళ్లారు. దీంతో ఈఎంఐలు కట్టలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా భార్యా,పిల్లలతో కామారెడ్డిలో నివాసముంటున్న రమేశ్ శనివారం రాత్రి చుక్కాపూర్ వచ్చి బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
మనస్తాపంతో మహిళ..
రాజంపేట: మనస్తాపంతో ఉరేసుకొని మహిళ మృతి చెందిన ఘటన రాజంపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోడెంగల మల్లేశం 18 సంవత్సరాల క్రితం తన మొదటి భార్య చనిపోవడంతో సిద్దవ్వను పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం అనారోగ్యంతో మల్లేశం చనిపోవడంతో సిద్దవ్వ తరచూ మనోవేదనకు గురయ్యేది. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉన్న సోదరి ఇంటికి వెళ్లిన ఆమె శనివారం సాయంత్రం రాజంపేటకు వచ్చింది. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. కుటుంబసభ్యులు ఉదయం 7 గంటల ప్రాంతలో సిద్దవ్వ గదిని తెరిచిచూడగా దూలానికి ఉరేసుకొని కనిపించింది. సోదరుడు ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు.