
గుండె పోటెత్తుతోంది!
జిల్లాలో ఏడాదికేడాది గుండెవ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుండె సమస్యల బారిన పడిన వారు ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటే వాల్స్ బ్లాక్ అయిన విషయం బయటపడి స్టంట్లు వేయడమో, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడమో జరుగుతోంది. అయితే సడెన్ కార్డియాక్ అరెస్టు జరిగినపుడు క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల జరుగుతున్న మరణాల్లో ఎక్కువగా సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు సంబంధించినవే ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలామంది వృత్తిపరమైన, కుటుంబ, ఆర్థిక సమస్యలతో ఒత్తిళ్లకు లోనవవుతున్నారు. అలాంటి వారే ఎక్కువగా గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బయటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. వారంలో రెండు మూడు రోజులు బయటికి వెళ్లి తినే అలవాటు నేటి జనరేషన్‌లో పెరిగిపోయింది. దీంతో ఆహార పదార్థాల తయారీలో వాడుతున్న నూనెలు, మసాలాలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
చాలా మంది అర్ధరాత్రి వరకు పడుకోకుండా బయట తిరుగుతుంటారు. సరైన నిద్ర లేకపోవడం, దానికి తోడు వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తిండి విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. మద్యం, సిగరెట్లు, ఇతర వ్యసనాలు కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. కుటుంబ సమస్యలంటూ, ఆర్థిక సమస్యలంటూ పీకలదాకా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. జీవన శైలిలో జరుగుతున్న మార్పులు ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. గుండె సమస్యలకు అనేక కారణాలు ఉంటున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చాలా మంది అనవసర ఒత్తిళ్లతో గుండె సమస్యల బారిన పడుతున్నారంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ కనీసం వాకింగ్ గానీ, మరే రకమైన వ్యాయామమైనా చేయాలని పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పడు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్న జనం
సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో
చాలామంది మృత్యువాత
నేడు వరల్డ్ హార్ట్ డే