
రక్తదానంతో ఆరోగ్యం
కామారెడ్డి టౌన్ : రక్తదానం చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతోపాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలను నిలిపిన వారమవుతామని హై కోర్టు అదనపు న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు అన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే పుణ్యకార్యం రక్తదానమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయనకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్‌ఆర్ వరప్రసాద్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రలు ఘన స్వాగతం పలికారు. జీజీహెచ్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో న్యాయమూర్తి నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు రక్తదానం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. తాను కూడా రెస్ క్రాస్ సోసైటి సభ్యుడినని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూప్ నిర్వాహకుడు బాలుని న్యాయమూర్తి సన్మానించారు. రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా కోర్టును సందర్శించి ఆవరణలో మొక్కలను నాటారు. జిల్లాలోని న్యాయమూర్తులతో సమావేశమై జుడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి టి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సూర సుమలత, ప్రథమ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి దీక్ష, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ న్యాయమూర్తులు వినీల్‌కుమార్, సుష్మ, భార్గవి, డీఎఫ్‌వో నిఖిత, బార్ అసోసియేషన్ అద్యక్షుడు నంద రమేశ్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.