
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
నాగిరెడ్డిపేట: జిల్లాలో గత నెలాఖరులో కురిసిన భారీవర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. పంట నష్ట పరిహారం కోసం సోమవారం నాగిరెడ్డిపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే సహించేది లేదన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో పంటలు నీటమునిగి రైతులకు నష్టం జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి తాడ్వాయి మండలంలో పర్యటించడమేంటని విమర్శించారు. కోతకు వచ్చిన పొలాలు, నోట్లోకి వచ్చిన బుక్క దూరమవుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకు పట్టడంలేదని ఆయన ప్రశ్నించారు. వరదల కారణంగా ధ్వంసమైన పోచారం ప్రధాన కాలువకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
అనంతరం రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావుకు అందించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట ఎస్సైలు భార్గవ్‌గౌడ్, మహేష్, దీపక్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆందోళనలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మనోహర్‌రెడ్డి, జయరాజ్, మాజీ ఎంపీపీ రాజ్‌దాస్, రైతు నాయకుడు బొల్లు నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.