
బతుకమ్మ వేడుకలను వైభవంగా జరపాలి
● ప్రభుత్వ కార్యాలయాలను
ముస్తాబు చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలన్నారు. జిల్లాలో బతుకమ్మ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, నిమజ్జనం చేసే వాగులు, చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మైకులను ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టరేట్‌లో సద్దుల బతుకమ్మ వరకు రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరపాలని ఆదేశించారు. 30 వ తేదీన కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించాలన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలకు జిల్లా నోడల్ అధికారిగా డీఆర్‌డీవో సురేందర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.