
పోరాటంతోనే రాచరికం నుంచి విముక్తి
పురోగతిలో ఇళ్ల నిర్మాణాలు..
కామారెడ్డి టౌన్: తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించి, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారామని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హౌసింగ్ బోర్డ్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటి వరకు పల్లెలో నెలకొన్న వెట్టి చాకిరీ, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృ భాష అణిచివేత, మతపరమైన నిరంకుశ ధోరణలు తొలగి హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొందిందన్నారు. రాష్ట్రంలో జరిగిన మార్పులతోనే దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ముందుందన్నారు. జిల్లా వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. రైతు భరోసా కింద జిల్లాలో 3,03,568 మంది రైతుల ఖాతాల్లో రూ. 305.98 కోట్లు జమచేశామన్నారు. కొత్తగా 16,152 రేషన్ కార్డులు మంజూరు చేశామని, 49,971 మంది కుటుంబ సభ్యులను పాత రేషన్ కార్డులలో జతచేశామని పేర్కొన్నారు. రూ. 500 గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో 1,50,131 మంది వినియోగదారులకు 5,58,981 గ్యాస్ సిలిండర్‌లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్‌లు కలిపి 1,62,000 మందికి ప్రతినెలా రూ. 36.12 కోట్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా జిల్లాలో 1,63,163 మంది వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
గత నెలలో కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రక్షణ చర్యల్లో నిమగ్నమైందని, తద్వారా ప్రాణనష్టం తక్కువగా జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అత్యవసర బృందాల ఆధ్వర్యంలో 15 ప్రాంతాలలో 17 రక్షణ చర్యలు చేపట్టి 1,251 మందిని కాపాడారన్నారు. ముంపు ప్రాంతాలలో 740 కుటుంబాలలోని సభ్యులకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. నష్టపోయిన 1,737 నివాస గృహాలకు రూ. 81.85 లక్షల పరిహారం మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రాణనష్టం జరిగిన ఆరు కుటుంబాలకు సీఎం చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున అందజేశామన్నారు. జిల్లాలో 28,615 ఎకరాలలో పంటనష్టం జరిగిందన్నారు. కామారెడ్డిని నేర రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు శాఖ చర్యలతో పాటు ప్రజల సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు 11,621 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 6,063 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కోదండరెడ్డి తెలిపారు. ఇందులో 2,663 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ వరకు, 736 గోడ లెవల్ వరకు, 306 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 43.21 కోట్లు చెల్లించామని వివరించారు. నాలుగు మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యాచరణ ద్వారా శానిటేషన్, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, పార్కుల నిర్వహణ లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో జరిగిన మార్పు వల్లే
దేశవ్యాప్తంగా తెలంగాణకు కీర్తి
ప్రజాపాలన దినోత్సవంలో
వ్యవసాయ, రైతు సంక్షేమ
కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

పోరాటంతోనే రాచరికం నుంచి విముక్తి