
‘ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. బుధవారం కామారెడ్డి మండలం క్యాసంపల్లి రైతు వేదికలో కామారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని ఆంగన్వాడీ టీచర్లకు పోషణ మాసం, పోషణ్ భీ – పడాయి భీ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాలపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ప్రారంభమైన పోషణ మాసం వచ్చేనెల 16 వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. కేంద్రాలకు వచ్చేవారిలో పోషణ లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత అంగన్‌వాడీ టీచర్లపై ఉందన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో శ్రీలత, సూపర్‌వైజర్లు కవిత, పద్మజ, ఉమ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.