
పలువురిపై కేసు నమోదు
మోపాల్: మండలంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల ఎల్లయ్యపై అకారణంగా దాడిచేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లయ్య టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదేక్రమంలో ఆదివారం సాయంత్రం గేదెలు అడ్డుగా ఉన్నాయని టిప్పర్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. వెనకాల బైక్‌లపై వస్తున్న నిజామాబాద్‌కు చెందిన యువకులు టిప్పర్‌ను ఎందుకు నిలిపావంటూ ఎల్లయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడ్డారు. ఆరు ద్విచక్ర వాహనాలపై పది మంది యువకులు వచ్చి దాడిచేశారని ఎల్లయ్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా.. మెదక్ పట్టణానికి చెందిన షేక్ మహాబూబ్(20)అనే యువకుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వచ్చాడు. ప్రాజెక్టు అలుగు పైనుంచి వెళ్తుండగా, కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. నీటమునిగి ఊపిరాడక మృతిచెందినట్లు తెలిసింది. మృతుడి అన్న షేక్ వాజీద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కృష్ణాజివాడి గ్రామ శివారులో కరంట్ వైర్లకు నెమలి తగిలి షాక్‌తో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా కరంటు సరఫరా నిలిచిపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది వచ్చి స్తంభాలను, వైర్లను పరిశీలించారు. సమస్యను గుర్తించకపోవడంతో వేరే లైన్‌కు కనెక్షన్ ఇచ్చారు. తిరిగి ఆదివారం అధికారులు గ్రామశివారులో గల విద్యుత్ స్తంభాలు, వైర్లను పరిశీలించారు. శివారులోని వైర్లపై నెమలి పడి చనిపోయినట్లు కనిపించిందన్నారు. దీంతో వైర్లపై మృతి చెంది ఉన్న నెమిలిని కిందికి తీసి యథావిధిగా కరంటు కనెక్షన్ ఇచ్చారు.

పలువురిపై కేసు నమోదు