
చుట్టం చూపుగా వచ్చి చోరీలు
● రాజస్థాన్‌కు చెందిన నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: చుట్టం చూపుగా వచ్చి, అనుమానం రాకుండా వాహనానికి తెలంగాణ నంబర్ ప్లేట్ పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 25 న జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన మాసిరెడ్డి శివారెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి దైవదర్శనం కోసం వేములవాడకు వెళ్లింది. మరుసటి రోజు వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని 19 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేశారు. శనివారం హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాకబు చేయగా హిందీలో మాట్లాడాడు. తెలంగాణ నంబర్ ప్లేట్ గల కారులో తిరుగుతూ హిందీలో మాత్రమే మాట్లాడడంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రంలోని కరోలీ జిల్లా అజీజ్‌పూర్ గ్రామానికి చెందిన హన్సరాజ్ మీనాగా గుర్తించారు. అతడు కొద్ది రోజుల క్రితం మెదక్ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉండే తన బంధువు ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడని పేర్కొన్నారు. స్నేహితుడైన అభిషేక్‌తో కలిసి కామారెడ్డిలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేశాడన్నారు. నిందితుడి వద్ద నుంచి 2 తులాల బంగారు ఆభరణాలు, చోరీకి ఉపయోగించిన కారు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరిపై రాజస్థాన్‌లో అనేక దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిసిందని, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. నిందితులు చోరీ చేిసిన ఇతర బంగారు ఆభరణాలను గుర్తించేందుకు, మరో నిందితుడు అభిషేక్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన అధికారులను అభినందించి రివార్డులను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి పాల్గొన్నారు.