
ఉడత పేరుతో..
చాలా గ్రామాల్లో ఇంటి పేర్లు పక్షులు, జంతువుల పేరుతో ఉన్నాయి. పలువురికి అడవి జంతువులైన ఏనుగు, పులి, నక్క వంటి ఇంటి పేర్లున్నాయి. అలాగే కుక్కల, ఎలుక, ఉడుత, చిలుక, కొంగ, కొంగల, కోతి, కాకి, బాతు, నెమలి అన్న పేర్లూ ఉన్నాయి. వ్యవసాయంలో ఒకప్పుడు కీలకంగా ఉన్న ఎద్దు సైతం చాలామందికి ఇంటిపేరుగా ఉంది. మేక, మేకల, గుర్రం, గొర్రెల, పిల్లి, పంది, పోతుల, పోతరాజు, పాముల.. ఇలా అనేక రకాల ఇంటి పేర్లు ఉన్నాయి.
కొన్ని కుటుంబాల ఇంటి పేరు శరీరంలోని అవయవాలనుంచి వచ్చింది. కొందరి మారుపేరు బొడ్డు, ముక్కు అని ఉంది. మీసాల, గడ్డం, గడ్డంవార్, గోరు, గోళ్ల పేరుతోనూ ఇంటి పేర్లున్నాయి.
రోజూ మనం తినే కూరగాయలు, ఇతర పంటల పేర్లే ఇంటి పేరుగా కలిగిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వంకాయల, మిరపకాయల, తోట, తోటకూర, చామకూర, గుమ్మడి, పసుపు, పాలకూర, పాలమాకుల వంటి పేర్లున్నాయి. కంది, కందుల, జొన్న, జొన్నల, పసుపు, పసుపునూరి, అల్లం, ఆలుగడ్డ, పోకల, గుమ్మడి, పత్తి, ఆముదాల, సామల, మక్కల వంటి పేర్లు చాలా కుటుంబాలు ఇంటి పేరుగా కలిగి ఉన్నాయి.
చెట్లు, పువ్వులనుంచీ చాలా మందికి ఇంటి పేరు వచ్చింది. చింత, చింతల, కొబ్బరికాయ, ఇప్పకాయ, మామిడి, మామిండ్ల, నిమ్మ, నిమ్మల, జీడి, తాటి, తాటికాయల, తాటిపాముల, తాళ్ల వంటి పేర్లతోపాటు వేప, యాప పేర్లు కూడా ఇంటి పేర్లుగా మారాయి. మల్లెల, మల్లెపూల, చామంతి, చామంతుల, గన్నేరు పేర్లు కూడా ఉన్నాయి.
ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అనే సామెత వినే ఉంటాం. ఎందుకంటే ఉప్పు ఉంటేనే రుచి ఉంటుంది. ఉప్పు పేరు ఇంటి పేరుగా ఎన్నో కుటుంబాలు కలిగి ఉన్నాయి. ఉప్పుతో పాటు ఉప్పల అనే పేరు కూడా ఉంది. పప్పు, పప్పుల అనే పేర్లతో పలువురికి ఇంటి పేర్లున్నాయి. నేతి కూడా ఇంటి పేరుగా ఉంది.
మా ఇంటి పేరులో ఉ డుత ఉంటుంది. మా ప్రాంతంలో ప్రతి ఇంటి పేరు పక్కన వార్ అని పెడతారు. అందు కే మా ఇంటి పేరు ఉడతవార్. ఉడత పేరు ప్రత్యేకమనే అనిపిస్తుంది.
– ఉడతవార్ సుభాష్, మద్నూర్
కాదేదీ సర్‌నేమ్‌కు అనర్హం
మారుపేరుగా పక్షులు, జంతువులు, చెట్లు, పువ్వుల పేర్లు
ఉప్పు, పప్పు, కారం,
కూరగాయలతోనూ ఇంటి పేరు..
తరతరాలుగా ఆయా పేర్లతోనే
పిలుచుకుంటున్న జనం