
రాజీయే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
వరప్రసాద్
● లోక్ అదాలత్‌లో 2,294
కేసుల పరిష్కారం
కామారెడ్డి టౌన్ : రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ వీఆర్‌ఆర్ వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కోర్టులలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్‌లో బ్యాంక్, క్రిమినల్, సివిల్, కుటుంబ, ఆయా కేసులకు సంబంధించి కక్షిదారులు ఇరువర్గాలు రాజీ చేసుకుని రాజమార్గంలో కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగంచుకుని కక్షిదారులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా కూడా ప్రజలకు పరిష్కారాలు లభించే అవకాశాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కల్పిసుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సురా సుమలత, సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ దీక్ష, ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా ఎనిమిది లోక్ అదాలత్ బెంచీల ద్వారా మొత్తం 2,294 కేసులకు పరిష్కారం చూపినట్లు న్యాయమూర్తులు తెలిపారు. ఇందులో క్రిమినల్ కేసులు 2,162, సివిల్ 24, సైబర్ క్రైం 23, బ్యాంక్ 80, మోటార్ అక్సిడెంట్ క్లయిమ్ 5 కేసులు ఉన్నాయన్నారు. బాధితులకు నష్టపరిహారంగా రూ. 1,52,18,066 అందజేశామని పేర్కొన్నారు.