
వరద బాధితులకు సాయం అందించాలి
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంతో పాటు రాజంపేట మండలంలో వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని కలెక్టర్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో పర్యటించారు. అధిక వర్షాల కారణంగా వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇప్పటికే తాత్కాలిక నష్టపరిహారం అందించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు దుప్పట్లు, చీరలు, బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరకులను అందిస్తున్నామన్నారు. వాటిని రెవెన్యూ అధికారులు బాధితులకు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.