
పుత్తడి పరుగులు
కామారెడ్డి టౌన్: పసిడి ధర పరుగులు పెడుతోంది. గతనెల ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలలోపు ఉండగా.. చివరి నాటికి 1.05 లక్షలకు చేరింది. మంగళవారం రూ. 1,07,500 లకు చేరుకుంది. వెండి ధర కూడా పెరుగుతూ వస్తోంది. మంగళవారం కామారెడ్డి మార్కెట్‌లో తులం వెండి ధర రూ. 1,280 ఉంది. పెరుగుతున్న ధరలను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. బంగారం కొనే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు.
బాధితులకు ఎస్‌ఆర్
ఫౌండేషన్ భరోసా
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వరదలతో సర్వం కోల్పోయినవారికి వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డికి చెందిన ఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసరాలు అందజేశారు. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీలతో పాటు మరికొన్ని కాలనీలలో ఒక్కో కుటుంబానికి రూ.3 వేల విలువ గల బియ్యం, ఇతర సామగ్రిని అందించి భరోసా కల్పించారు. చాలామంది పిల్లల పుస్తకాలు, నోట్‌బుక్స్ నీటిపాలయ్యాయని, వారికి పుస్తకాలు ఇప్పిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్‌గౌడ్, మట్ట శ్రీనివాస్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, రాజాగౌడ్, నాగరాజ్‌రెడ్డి, శంకర్‌గౌడ్, పైడి రాంరెడ్డి, పర్శరాములు, శేఖర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘విద్యుత్ సరఫరా చేయండి’
నాగిరెడ్డిపేట: పంటలకు నీరందించేందుకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ సూచించారు. మంగళవారం ఆయన పోచారం ప్రాజెక్టు సమీపంలో నీటమునిగి తేలిన పంటలను పరిశీలించారు. వరదనీరు వెళ్లిపోయినందున పంటలకు నీరందించేందుకు విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయనవెంట ఏఈ నాగరాజు, సిబ్బంది ఉన్నారు.
నిజాంసాగర్‌లోకి
భారీ వరద
నిజాంసాగర్: కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వ స్తోంది. మంగళవారం 80,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 14 వరద గేట్లను ఎత్తి 97,070 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,401.70 అడుగుల (13.319 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.
సింగితం రిజర్వాయర్‌లోకి..
ఎగువన కురుస్తున్న వర్షాలవల్ల మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్‌లోకి 1,150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అంతే నీటిని రిజర్వాయర్ మూడు వరద గేట్లను ఎత్తి నిజాంసాగర్ ప్రధాన కాలువకు మళ్లిస్తున్నారు.
కౌలాస్‌లోకి 1,430 క్యూసెక్కులు..
జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి మంగళవారం 1,430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కౌలాస్ ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 1,801 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. కౌలాస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 457.65 మీటర్ల (1.152 మీటర్లు) నిల్వ ఉంది.

పుత్తడి పరుగులు