
రేపు జిల్లాకు సీఎం రాక!
● వరద ప్రభావిత ప్రాంతాల్లో
పర్యటనకు ఏర్పాట్లు
● నష్టంపై అధికారులతో
సమీక్షించే అవకాశం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : భారీ వర్షాలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఎక్కడెక్కడ పర్యటిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. వర్షాల ప్రభావం ఎలా ఉంటుందన్నదాని ఆధారంగా సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి.
జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. జిల్లాకేంద్రంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో గతనెల 28న సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపల్లి పర్యటన అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలీకాప్టర్ ఇక్కడ ల్యాండ్ కాలేకపోయింది. తాజాగా ఆ పర్యటనను ఖరారు చేశారు. జిల్లాలో పరిస్థితిని తెలుసుకునేందుకు రేవంత్‌రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, మహ్మద్‌నగర్ మండలాలతో పాటు కామారెడ్డి పట్టణంలో సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన అనంతరం వరద నష్టంపై జిల్లా అధికారులతో సీఎం సీక్షిస్తారని తెలుస్తోంది. దీంతో అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పంట నష్టం, ఆస్తి నష్టంతోపాటు రోడ్లు, వంతెనలు ధ్వంసమవడం, పోచారం ప్రాజెక్టు, చెరువులు దెబ్బతినడం వంటి వాటికి సంబంధించి నష్టాలు, పునర్నిర్మాణానికి అయ్యే వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. సీఎం జిల్లాలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత వరద పీడిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఆశతో ఉన్నారు.
వ్యవసాయ కళాశాల భవనం పరిశీలన
నాగిరెడ్డిపేట : సీఎం పర్యటిస్తారన్న సమాచారం మేరకు మంగళవారం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాసరావు మండలంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. జిల్లాలో జరిగిన వరద నష్టంపై సీఎం మండలంలోని పాలిటెక్నిక్ కళాశాల భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని ప్రాథమికంగా సమాచారం అందిందని ఆర్డీవో తెలిపారు. అనంతరం అధికారులు పోచారం ప్రాజెక్టును కూడా పరిశీలించారు. వారివెంట నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై భార్గవ్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాంగౌడ్ ఉన్నారు.