
నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి నిమజ్జనోత్సవం జరిగే టేక్రియాల్ వద్దనున్న అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో 7 వందలకుపైగా వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువు లోనికి ఎవరు పడితే వారు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. క్రేన్లు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. వాటర్ ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేసి రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఫిషరీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. గణేశ్ విగ్రహాలకు తగలకుండా విద్యుత్ వైర్ల ఎత్తు పెంచాలని సూచించారు. శోభాయాత్ర వచ్చే రహదారికి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. ఈనెల 4 నుంచి 6 వరకు అధిక సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయన్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినాయక శోభాయాత్ర జరిగే రహదారిని పరిశీలించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.