
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
మాచారెడ్డి: అక్కాపూర్‌లో పోడు భూముల సమస్యను పరిష్కరించి హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యుడు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అక్కాపూర్‌లో అటవీ అధికారులు ధ్వంసం చేసిన రైతుల పంటలను పరిశీలించి మాట్లాడారు. యాబై ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా వారేసిన పంటలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నాయకులు దేవరాం, రమేశ్, ప్రకాశ్, సురేశ్, కిషోర్, బాబన్న, దామోదర్, లింబన్న, తదితరులు ఉన్నారు.